Aug 03,2023 00:00

ఎమ్మెల్యేను కలిసిన గంగవరం పోర్టు కార్మికులు

ప్రజాశక్తి- గాజువాక : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అదాని గంగవరం పోర్టు కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షలు బుధవారం నాటికి 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇంటికి కార్మికులు వెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వం వైపు నుంచి అదాని గంగవరం పోర్టు యాజమాన్యంతో మాట్లాడుతున్నప్పటికీ మొండిగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం 10 మంది కార్మికులను విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వద్దకు, వైసిపి రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి దగ్గరకు ఎమ్మెల్యే నాగిరెడ్డి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సమక్షంలో విశాఖ ఎంపీకి కార్మికులు వినతిపత్రం అందించారు. ఈ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీని కోరారు. అనంతరం సుబ్బారెడ్డిని కలిసి సమస్యలను వివరించారు. వేతనాలపై పోర్టు యాజమాన్యం స్పష్టత ఇవ్వడంలేదని, మరో మారు మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు, కోశాధికారి వాసుపల్లి ఎల్లాజీ, నాయకులు గంటిపిల్లి అమ్మోరు, మాద అప్పారావు, గంటిపిల్లి లక్ష్మయ్యచ నొల్లి స్వామి, కదిరి సత్యానందం, పేర్ల నూకరాజు తదితరులు పాల్గొన్నారు.