కడప అర్బన్ : అశాస్త్రీయమైన విద్యుత్ బిల్లులు వసూళ్లను నిరసిస్తూ ఈ నెల 30న వామపక్షాలు నిర్వహించే నిరసన జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పిలుపు నిచ్చారు. బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో నగర కార్యదర్శి రామ్మోహన్ అధ్యక్షతన జిల్లాలోని వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎ, సిపిఐ,ఆర్‌ఎస్పి, సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ-1),సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ-2), ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) హాజరయ్యారు. సమావేశ నిర్ణయాలు సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ తెలిపారు. 2022 విద్యుత్ చట్టం కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో దొడ్డి దారిన ఆర్డినెన్స్ రూపంలో అప్రజాస్వామికంగా తెచ్చారని విమర్శించారు. ఈ బిల్లు సారాంశం కేంద్ర, రాష్ట్ర సర్కార్లు ఏ నెల ఖర్చు ఆ నెలలోనే ప్రజలపై భారాలు మోపి దోపిడీ చేయడయన్నారు. అసలు విద్యుత్ బిల్లు 18 శాతం అయితే, ఇతర చార్జీలు 82 శాతం సద్దుబాటు పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది చాలాదంటూ, ప్రజల ఇండ్లలో టీవీలు, ఫ్రిజ్లు,ఏసీలు ఉంటే డెవలప్మెంట్ చార్జీల పేరుతో మరో 25 శాతం అదనంగా బిల్లులు వేస్తున్నారన్నారు. ఈ పద్ధతి పూర్తిగా అశాస్త్రీయమన్నారు. ప్రజాధనాన్ని పాలకులు అవినీతితో జోబులు నింపుకుంటున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రజాధనాన్ని పంపిణీ చేస్తున్నారని, ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలో భాగంగా ప్రత్యక్ష బిల్లుల కంటే పరోక్ష బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత కరెంటు అంటూనే, మరోవైపు స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులపై విద్యుత్ బిల్లుల భారాలు వేయబోతున్నారని తెలిపారు. విద్యుత్ భవన్ ఎదుట నిర్వహించే నిరసనలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ-1)జిల్లా కార్యదర్శి డబ్ల్యూ. రాము,ఆర్‌ఎస్పి జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి రమణయ్య, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి జయ వర్ధన్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్ పాల్గొన్నారు.










