Sep 27,2023 22:52

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌ (విజయవాడఅర్బన్‌)
విద్యారంగ సమస్యలు పరిష్కారానికై ఈ నెల 30వతేది ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి విద్యార్ధులందరు తరలిరావాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్న కుమార్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ బాలోత్సవ భవన్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రసన్నకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల సమస్యల పట్ల మొద్దునిద్ర పోతుందన్నారు. అసెంబ్లీ జరిగిన ఐదు రోజుల్లో విద్యార్ధుల సమస్యల గురించి ఊసెత్తలేదని వాపోయారు. నాలుగున్నరేళ్ళ కాలంలో ఇచ్చిన హామీలు మాటలకే తప్ప అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. పథకాల అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి పధకాలలో ఎందుకు కోతలు విధించారో సమాధానం చెప్పాలని కోరారు. ఇంటర్‌ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. మధ్యాహ్న భోజన పధకాన్ని నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. డిగ్రీ విద్యలో 2018 నాటికి 3లక్షలు ఉండాల్సిన అడ్మిషన్లు 2023 విద్యా సంవత్సరానికి లక్షా 20వేలకు తగ్గడానికి ప్రభుత్వం విధానాలే కారణమని అన్నారు. కెజి నుండి పిజి ఉచిత విద్య హామీ ఇచ్చి జిఓ:77తో పేద విద్యార్ధులకు పిజి విద్యను దూరం చేయడానికి ప్రభుత్వం సిగ్గుపడాలి. ప్రభుత్వ హాస్టళ్ళు ఆద్వానంగా మారాయని అరకొర వసతులతో, ఆకలి కేకలతో విద్యార్ధులు అలమటిస్తున్నారని వాపోయారు. ధరలు పెరిగిన నేపధ్యంలో హాస్టల్‌ విద్యార్ధులకు మెస్‌ చార్జీలు 3వేల రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. సోమేశ్వరరావు, షేక్‌. జాహీదా, ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు గోపి నాయక్‌, నాయకులు కుమార స్వామి, మధన్‌ పాల్గొన్నారు.