Jul 25,2023 23:31

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర ట్రేడ్‌ యూనియన్ల సంయుక్త పిలుపులో భాగంగా ఈనెల 30వ తేదీన విజయవాడ, సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కర్షక, కార్మిక రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతు, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు పోస్టర్‌ను స్థానిక బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో పలు సంఘాల నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. పంటలన్నింటికీ సమగ్ర పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలని, విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంపుసెట్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల బిగించటాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల పంట రుణాలను రద్దు చేయాలని, కేరళ తరహా రుణవిమోచన చట్టాన్ని ఆమోదించి, రైతుల ఆత్మహత్యలు నివారించాలని, లేబర్‌ కోడ్‌లు రద్దు చేసి, కార్మిక చట్టాలను పునరుద్దరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన 750 రైతు కుటుంబాలకు, లఖింపూరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు సహాయం అందించాలని, కేంద్ర మంత్రి అజరు మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగించాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న ఈ సదస్సులో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పోస్టర్‌ ఆవిష్కరణలో రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు కంచుమాటి అజరుకుమార్‌, కె.రంగారెడ్డి, పి.శివాజీ, యు.గానిరాజు, వి.నరసింహారావు, కె.రాజశేఖ ర్‌రెడ్డి, కె.శ్రీధర్‌రావు, వెంకటేశ్వరరావు, ఇ.అప్పారావు, బి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, కృష్ణ, పాల్గొన్నారు.