ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చియార్డు చైర్మన్ పదవిని నాలుగేళ్లుగా బీసీలకే కేటాయిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. యార్డుకు నూతన చైర్మన్‌గా నియమితులైన నిమ్మకాయల రాజనారాయణతో వెళ్లి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళవారం కలిశారు. ఈనెల 30న రాజనారాయణ ప్రమాణస్వీకారం సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మొత్తం 137 కార్పొరేషన్లకు సంబంధించి 484 పదవులిస్తే అందులో 243 బీసీలకు ఇచ్చినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి మండలిలో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పించినట్లు చెప్పారు.










