ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ఈ నెల 30న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో 'మే డే' సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అల్లూరి విజ్ఞాన కేంద్రం బాధ్యులు జిఎస్.రాజేశ్వరరావు, సాంస్కృతిక విభాగం బాధ్యులు దండు నాగేశ్వరరావు, ఎల్లాజీ తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మే డే సందర్భంగా నగరంలోని కార్మికులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులలో కళా ప్రావీణ్యం కలవారందరినీ ఒక దగ్గరకు చేర్చి 30న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. పాటలు, పద్యాలు, శ్రామిక అభ్యుదయ గీతాలకు శాస్త్రీయ నృత్యాలు, కోలాటాలు, తప్పెట గుళ్లు, ఏకపాత్రాభినయాలు, ఫ్లూటు తదితర వాయిద్య కళారూపాలు, మిమిక్రి, హాస్యం, షార్ట్ ఫిలిమ్స్ తదితర కళారూపాల్లో ప్రావీణ్యం ఉన్న వారంతా యూనియన్ల అనుబంధాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా పాల్గొనవచ్చని తెలిపారు. ప్రదర్శించే ఏ కళారూపమైనా విశాఖ స్టీల్‌ప్లాంట్ ఇతర ప్రభుత్వరంగసంస్థల పరిరక్షణ, దేశభక్తి, దేశ సమైక్యత, సమగ్రత, లౌకికతత్వం, సామాజిక న్యాయంపై ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన కళాకారులు కోలాటం, శ్రామిక గీతాలకు శాస్త్రీయ నృత్యాలు, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయాలు, అభ్యుదయగేయాలు, లఘునాటికలు ప్రదర్శిస్తామని ముందుకు వచ్చారని చెప్పారు. విశాఖ నగరంలోని కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో కళా ప్రావీణ్యం ఉండి, పాల్గొన దల్చుకున్న వారంతా ఈ నెల 25వ తేదీ లోగా తమ ఎంట్రీలను 9490750661, 9490098794 నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు. పాల్గొనే వారందరికీ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందిస్తామని తెలిపారు.










