
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం నగరంలో ఈ నెల 30న గురజాడ వర్థంతి నిర్వహించాలని నగరానికి చెందిన పలు సాహితీ సంస్థలు నిర్వహించాయి. శ్రీకాకుళం నగరంలోని స్థానిక కథానిలయం నిర్వహించిన సాహితీ స్రవంతి కన్వీనర్ కె.శ్రీనివాసు అధ్యతన కవులు, రచయితల సంఘాలు సమావేశం నిర్వహించాయి. ఇందుకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించాయి. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, అరసం రాష్ట్ర అధ్యక్ష, వర్గ సభ్యులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ గురజాడ రచనలు 150 ఏళ్ల కిందటవే అయినా నేటి పరిస్థితులకు ప్రతిబింబిస్తాయని చెప్పారు. శ్రీకాకుళం సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి దాసరి రామచంద్రరావు మాట్లాడుతూ వర్థంతి సభలో గురజాడ శాస్త్ర విజ్ఞానం మహిళా సాధికారత, కుల వివక్ష, నిరుద్యోగం, ఉపాధి, ఆర్థిక వృద్ధి వంటి అంశాలను చర్చిస్తామని చెప్పారు. జనసాహితి, తెలుగు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శులు పి.మోహనరావు, ఆర్.వి.రమణమూరి మాట్లాడుతూ కార్యక్రమంలో విద్యార్థులను యువజనులను భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు సహకరిప్తామని గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎం.ప్రభాకరరావు, బాల కథానిలయం బాధ్యులు ఉమాకవి అన్నారు. ప్రముఖ కవులు కంచరాన భుజంగరావు, నెట్టిమి రమణారావు, తంగి ఎర్రమ్మ, ఉత్తరావిల్లి నాగేశ్వరరావు, చింతాడ తిరుమలరావు మల్లి తదితరులు పాల్గొన్నారు.