Jun 26,2023 23:01

ప్రజాశక్తి-సింగ్‌నగర్‌: పెంచిన కరెంట్‌ ఛార్జీలు తగ్గించాలని, ట్రూఆప్‌ ఛార్జీల వసూళ్లు ఆపాలని 61వ డివిజన్లో శాంతినగర్‌ భాస్కరరావు కొట్టు సెంటర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సమస్యలపై ఇంటింటికి తిరుగుతూ ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీల దోపిడీకి అంతుపొంతు లేకుండా పోతుందన్నారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో ప్రజలను కొల్లగొట్టే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 30న విద్యుత్‌ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాల్లో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు చింతల శ్రీనివాస్‌, జి.సుజాత, నాయకులు ఎస్‌ వెంకటేశ్వరరావు లీలాసాగర్‌, మారుతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వత్సవాయి: విద్యుత్‌ భారాలపై మండలంలోని పోలంపల్లి గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తమ్మినేని రమేష్‌ మాట్లాడుతూ పెరిగిన విద్యుత్‌ బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలకు షాక్‌ ఇస్తున్నాయన్నారు. ఉచిత విద్యుత్‌ను క్రమంగా నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కంచర్ల కొండయ్య, తమ్మినేని రాంబాబు, పెంటి కోటేశ్వరరావు, కంచర్ల నాగరాజు, ఎస్‌.మల్లికార్జునరావు, గూటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-భవానీపురం: పశ్చిమ నియోజకవర్గంలోని సితార సెంటర్లో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌ దోపిడీ వల్లే విద్యుత్‌ చార్జీలు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. విద్యుత్‌ బిల్లులను సకాలంలో రీడింగ్‌ తీయకుండా ఎక్కువ యూనిట్లు వచ్చిన తర్వాత రీడింగ్‌ తీసి శ్లాబురేటు మార్చి కోట్లలో బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు, పంచదార్ల దుర్గాంబ, ఉప్పలపాటి శివప్రసాదరాజు, కంచర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.