రాయచోటి టౌన్ ; రాయచోటి కేంద్రంగా 30 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామంజులు, ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్షి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట బీడీ కార్మికులు సిఐటియు నాయకులతో కలసి తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో రెగ్యులర్ వైద్యులు, సిబ్బంది తగినంత లేరని పేర్కొన్నారు. శ్రీకాళహస్తికి చెందిన డిస్పెన్సరీ డాక్టర్ వారంలో కేవలం బుధ, గురు వారాల్లో రెండు రోజులు మాత్రమే ఉంటారని మిగిలిన రోజులు రోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉందన్నారు. జిల్లాలో 30 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీడీ కంపెనీల యాజమాన్యాలు డూప్లికేట్ గుర్తింపు కార్డులిచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. వెయ్యి బీడీలు చుడితే రూ.200 నుండి రూ.240 వరకు లేదా రూ.260 ఇచ్చి నిలువు దోపిడి చేస్తున్న యాజమాన్యాల మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇఎస్‌ఐ స్కీమ్ ద్వారా కార్మికుల ఉద్యోగులకు మందులు, సిక్ లీవులు నిరుద్యోగభతి, పెన్షన్లు వంటి తదితర సౌకర్యాల కోసం తమ జీతంలోని కొంత నగదును ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ పేరుతో రిజర్వ్ బ్యాంక్‌లో మొత్తం లక్షా పది వేల కోట్లు జమ చేశారని పేర్కొన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామచంద్ర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా పరికరాలు, మందులు ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా పేద కార్మికులకు అరకొరగా అందుతున్న వైద్యాన్ని కూడా పూర్తి ప్రయివేట్‌కరణ చేసే దశలో ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికులు ప్రజలతో కలసి ఇఎస్‌ఐని బలోపేతం చేసే వరకు ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని పిలుపు నిచ్చారు. లేకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీడీ కార్మికులు మెహతాజ్, ముబీనా, ఖదిరీన్, అన్సారీ, రమీజా, గంగులమ్మ బైడ్డీ షర్మిలతో పాటు పలువురు బీడీ కార్మికులు పాల్గొన్నారు.










