
ప్రజాశక్తి-గొలుగొండ:కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 30 నుండి సెప్టెంబర్ 4 వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సబ్యులు అడిగర్ల రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం గొలుగొండ మండలం జోగుంపేటలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిగర్ల రాజు మాట్లాడుతూ, బిజెపి విధానాలు ప్రజలకు గుదిబండగా మారుతున్నాయన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే రద్దు చేసి, నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదన్నారు. గ్రామీణ ఉపాధికి నిధులు పెంచాలని, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు సాపిరెడ్డి నారాయణముర్తి మాట్లాడుతూ, గొలుగొండ మండలంలో వివిధ రకాల ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న గిరిజనలకు, రైతులకు సాగు నమోదు చేసి, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటి సభ్యులు సిహెచ్.రాము, రాజు, పండియ్య, సత్తిబాబు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.