Aug 18,2023 23:07

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు

ప్రజాశక్తి - పెదనందిపాడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 30 నుండి సెప్టెంబరు 4 వరకు ఆందోళన చేయనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో సిపిఎం విస్తృత సమావేశం సీనియర్‌ నాయకులు జె.రామారావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రో, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. మరోవైపు ప్రజలకు సరైన ఉపాధి లేక జీవితాలు దుర్భరంగా మారుతున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, ఈ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా నాయకులు కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ మణిపూర్‌లో గత 4 నెలలుగా మారణహోమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కామన్‌ సివిల్‌ కోడ్‌ పేరుతో ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చు పెడుతున్నారని, ఈ విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసినా రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం నిర్వహించే పోరాటాల్లోకి ప్రజలంతా కలిసి రావాలన్నారు. 30, 31 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా కరపత్రాలు పంపిణీ, వచ్చేనెల 1, 2 తేదీల్లో ప్రజాసమస్యలపై సచివాలయాల వద్ద ధర్నాలు, 3న నిరుద్యోగ సమస్యపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 4న తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో నాయకులు కె.శ్రీనివాసరావు, కె.వెంకటశివరావు, సిహెచ్‌.యానాదులు, భువనేశ్వరి, కె.బాబు, డి.శ్రీనివాసరావు, ఎం.రమణ పాల్గొన్నారు.