Aug 27,2023 20:04

మాట్లాడుతున్న మూలం రమేష్‌

ప్రజాశక్తి-ఉలవపాడు : నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెంచిన కరెంట్‌ ఛార్జీల భారాలను తగ్గించాలని, ఉద్యోగాలివ్వాలని, గిరిజనులకు శ్మశాన స్థలాలు ఇవ్వాలని, ఉలవపాడులోని డ్రెయినేజీ కాలువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు సమరభేరి యాత్రలు నిర్వహించాలని సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పేర్కొన్నారు ఈ యాత్రలో పాల్గొన్న నాయకులకు ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలని కోరారు. ఆదివారం సిపిఎం ఉలవపాడు మండల కమిటీ సమావేశం ఆ పార్టీ నాయకులు ఎస్‌.డి. గౌస్‌ బాషా అధ్యక్షతన వరిగ చేను సంఘంలోని కమ్యూనిటీ హాలులో జరిగింది. సమావేశంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సర్‌ ఛార్జీల పేరుతో కరెంట్‌ చార్జీలను, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాలను వేసిందని విమర్శించారు. ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మణిపూర్‌ లో జరిగిన మత ఘర్షణలో 170 మంది చనిపోయారని, మహిళలను నగంగా ఊరేగించారన్నారు. దీనిపై అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రధానిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పటానికి మూడు నిమిషాలు కూడా సమయం కేటాయించలేదని విమర్శించారు. క్రేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా పాలన చేస్తున్నాయన్నారు. పాలకులు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండగట్టి చైతన్యం చేసేందుకే ఈ సమరభేరి యాత్రలను సిపిఎం చేపట్టిందన్నారు. జయప్రదం చేయాలన్నారు. సిపిఎం మండల కార్యదర్శి జీవీబీ కుమార్‌ మండలంలో గిరిజనులు దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు దష్టి సారించి పరిష్కారం చేయాలని కోరారు. పార్టీ మండల నాయకులు పొట్లూరి రవి, కొమరగిరి వెంకటేశ్వర్లు,ఏలూరి నాగార్జున, ఎస్‌.డి. జహీర్‌, కే శేషమ్మ తదితరులు పాల్గొన్నారు