ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 30 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తెలిపారు. గుంటూరులోని శ్రీవెంకట్వేశ్వర విజ్ఞాన మందిరంలో 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు - ప్రస్తుత రాజకీయ పరిణామాలు'పై సిపిఎం ఆధ్వర్యలో శుక్రవారం సభ నిర్వహించారు. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించగా బాబూరావు మాట్లాడుతూ ఆగస్టు 30, 31 తేదీల్లో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ, 1, 2 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో విజ్ఞాపనలు అందచేయాలని సిపిఎం నిర్ణయించిందన్నారు. 3వ తేదీన నిరుద్యోగ సమస్యలపై రౌండ్‌టేబుల్ సమావేశాలు, 4వ తేదీన మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పేదలకు, పెత్తందారులకు యుద్ధం జరుగుతుందని సిఎం జగన్ అంటున్నారని వాస్తవంగా అసలైన పెత్తందారులకు జగన్ కొమ్ముకాస్తున్నారని అన్నారు. దేశంలో అత్యంత పెద్దపెత్తందారులైన ఆదాని, అంబానికి మద్దతిస్తున్న మోడీ బాటలో నడుస్తున్న జగన్ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనిస్తోందన్నారు. నాలుగేళ్లగా ఇసుక విధానం గందరగోళంగా మార్చేసి నిర్మాణ రంగాన్ని దెబ్బకొట్టారని విమర్శించారు. రాష్ట్రంలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బిజెపికి మూడు ప్రాంతీయ పార్టీలు మద్దతు పలకడం దారుణమన్నారు. మోడీ విజన్ బాగుందని చంద్రబాబు అనడం సిగ్గుచేటన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మోడీ చంద్రబాబుకు ఎలా నచ్చుతారని ప్రశ్నించారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పిన మోడీ ఇప్పుడు ఎందుకు నిధులివ్వడం లేదని ప్రశ్నించారు. 2 వేల ఎకరాల్లో రాజధానిని నిర్మిస్తే సరిపోయే దానికి అవసరానికి మించి భూములు తీసుకుని ఎటూ కాకుండా చేశారని అన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని, మోడీ ఆదేశాలను ముందే అమలు చేస్తూ సిఎం జగన్ ఆదాని, అంబానికి ఉపయోగపడేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. పన్నుల భారం మోపడంలో మోడీ, జగన్ జాయింట్ వెంచర్ అని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నారని అన్నారు.
ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో మైనార్టీలను దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా అమలుకు బిజెపి ప్రాధాన్యమిస్తోందని, ఉత్తర ప్రదేశ్‌లో 24 శాతంమంది ముస్లిములు ఉండగా వారికి ఒక్కసీటూ ఇవ్వలేదని చెప్పారు. జమ్ముకాశ్మీర్‌లో స్వయం ప్రతిపత్తిని రద్దు చేశారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకాశ్శీర్‌ను రాష్ట్రంగా కాకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారని అన్నారు.
పాశం రామారావు మాట్లాడుతూ బిజెపిపాలనలో నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ధరలు విపరీతంగా పెంచారన్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు. రాష్ట్రంలో ఇసుక సమస్యల వల్ల భవన నిర్మాణ కార్మికులకు నెలలో 20 రోజులు కూడా పని దొరకడం లేదని, అసంఘటితరంగ కార్మికులకు పనులు దొరకడం లేదని తెలిపారు. నిరుద్యోగం పెరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీస్తున్నారని అన్నారు. మనువాద రాజ్యాంగం అమలుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయినా కేంద్రంలో బిజెపికి టిడిపి, వైసిపి, జనసేన మద్దతు పలుకుతుండటం దారుణమన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసినా మూడు పార్టీలు మాట్లాడవని అన్నారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.భావన్నారాయణ, వై.నేతాజి, ఇ.అప్పారావు, ఎం.రవి, ఎస్‌ఎస్. చెంగయ్య, నళినీకాంత్ పాల్గొన్నారు.
బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. గుంటూరు సభలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రశ్నించే మేథావులు, ప్రజాస్వామ్య వాదులు, కవులు, మీడియా వారి గొంతు నొక్కడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్, సిబిఐ ద్వారా దాడులు చేయిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల్లోనే అవినీతి పరులున్నారా? అని ప్రశ్నించారు. బిజెపిలో ఎంతో మంది అవినీతి పరులున్నా ఈడి, సిబిఐ వారి జోలికివెళ్లడం లేదన్నారు. బిజెపికి మద్దతిచ్చే పార్టీల నాయకులు అవినీతికి పాల్పడినా వారిని పట్టించుకోరని, కేవలం తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలను లక్ష్యం చేసుకుని రాజ్యాంగ వ్యవస్థను బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా పార్లమెంటు జరగకుండా చేయడానికి బిజెపియే కుట్ర పన్నుతోందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశంలో మణిపూర్ ఘటనలు, అంతకుముందు జరిగిన సమావేశాల్లో పెగాసస్ అంశాలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పలాయనవాదం అవలంబించిందన్నారు. కేవలం తమకు అనుకూలమైన బిల్లుల ఆమోదం కోసమే పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెడుతుందన్నారు. అదానిని రక్షించేందుకు పెగాసస్ అంశంపై ఇంతవరకు దర్యాప్తు పూర్తి చేయలేదని ఈనెల 31లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని రాఘవులు గుర్తు చేశారు. మణిపూర్ ఘటనల్లో రెండు జాతుల మధ్య ఏర్పడిన ఘర్షణకు ఒక పరిష్కారం చూపకుండా ప్రధాని మోడీ కాలయాపన చేస్తున్నారని అన్నారు. మణిపూర్ ఘటనలో ఇప్పటివరకు 190 మంది మృతి చెందారని, పోలీసు స్టేషన్‌లో 4 వేల తుపాకులు తీసుకువెళ్లారని ప్రభుత్వ మద్దతు లేకుండా తుపాకులు తీసుకువెళ్లగలరా? అని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నచోట రెండుజాతుల మధ్య ఘర్షణలు జరిగి మహిలను వివస్త్రలను చేసిన ఘటనలపై ప్రధాని స్పందన చాలా దారుణంగా ఉందన్నారు. రాజ్యాంగంలోకి లౌకిక వాదాన్ని బిజెపి నాశనం చేస్తోందని, రాష్ట్రాల హక్కులపై దాడి జరుగుతున్నా వైపిపి ఎంపిలు నిసిగ్గుగా బిజెపికి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీ, నియామకాలను కేంద్రం పరిధిలోకి మార్చారని, ఇది సమాఖ్య స్ఫూర్తిపై తీవ్ర దాడి అని అభివర్ణించారు. పారిశ్రామిక వేత్తలు బకాయిలు రూ.17 లక్షల కోట్ల వరకున్నా కేంద్రం వారిపై చర్యలు తీసుకోదని, సామాన్యుల రుణాలపై మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం 26 పార్టీలతో 'ఇండియా' కూటమి ఆవిర్భవించిందన్నారు.










