* ప్రజల కష్టాలు పట్టని ప్రభుత్వాలు
* కార్పొరేట్లకు రాయితీలు, పేదలపై భారాలు
* సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 30 నుంచి ఆగస్టు నాలుగు తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో ప్రచార కార్యక్రమాల పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో, అధిక ధరలు అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. మోడీ ప్రభుత్వానికి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు తప్ప దేశ ప్రజల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజానీకం జీవనం కష్టంగా మారిందన్నారు. మోడీ గద్దెనెక్కిన వెంటనే రూ.450 ఉన్న గ్యాస్ సిలిండర్ నేడు రూ.1200కు పెరిగిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలూ పెరిగాయన్నారు. కాయగూరల ధరలు ఈనెలలో 37 శాతం పెరిగాయని, పప్పు ధాన్యాలు 45 శాతం పెరిగాయని వివరించారు. 2014లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం, ఉద్యోగాలు ఇవ్వలేదు సరే కదా పరిశ్రమలు మూతపడి లక్షలాదిమంది ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీకి నిధులు తగ్గిస్తూ ఎత్తివేయడానికి చూస్తోందని, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు తగ్గించిందని గుర్తుచేశారు. ప్రజలపై పన్నుల భారాల మోపుతూ, కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీ ఇస్తోందని విమర్శించారు.
ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ హామీని గాలికొదిలేసి ఏడుసార్లు పెంచారని చెప్పారు. ఇప్పుడు నెలవారీ పెంపుదలకు రంగం సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. లోటు భర్తీ పేరుతో ఛార్జీలు, సర్‌ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్‌డ్ ఛార్జీలు, ఎస్టాబ్లిష్‌మెంట్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జీలు తదితర పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై మోపుతున్నారని వివరించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అధిక ధరలు అరికట్టాలని కోరుతూ ఈనెల 30వ తేదీ నుంచి ప్రచారం, సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రామ వార్డు, సచివాలయాల్లో వినతిపత్రాలు అందజేత, 3న నిరుద్యోగ వ్యతిరేక దినం, 4న మండల కార్యాలయ వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు వివరించారు.










