పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు
30 నుంచి
కేంద్ర,రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై 'సమరభేరి'
-సిపిఎం సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి-నెల్లూరు:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 04 వరకు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమరభేరి నిర్వహిస్తున్నట్లు సిపిఎం నగర కమిటీ ప్రకటించింది. సోమవారం నగరంలోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అధిక ధరలను నియంత్రించాలని, పెంచిన కరెంటు చార్జీలు వెంటనే తగ్గించాలని, ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలతో ముడిపెట్టి రద్దు చేసిన పింఛన్లు రేషన్ కార్డులు,అమ్మఒడి పథకాలను తక్షణమే లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. టిడిపి ప్రభుత్వ హాయాంలో విద్యుత్తు ఛార్జీల పెంపుదలకు నిరసనగా ఆగష్టు 28న చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ అమరవీరుల స్ఫూర్తిగా కరెంటు చార్జీలు తగ్గేవరకు పోరాడుతామన్నారు. ఈ క్రమంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం సమరభేరి కార్యక్రమాన్ని ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేది వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో సిటీ నియోజకవర్గంలో సిపిఎం ప్రజా పోరుయాత్ర నిర్వహించిన సందర్భంలో అన్ని ప్రాంతాలలో, అన్ని వీధులలో,ప్రతి ఒక్కరూ తెలియజేసిన సమస్యగా కరెంటు చార్జీల సమస్య ముందుకు వచ్చిందన్నారు. ప్రభుత్వం భారీగా పెంచిన కరెంటు చార్జీలను భరించలేకపోతున్నామని ప్రజలు వాపోయారన్నారు. ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు వాడిన కరెంటు బిల్లు కన్నా అదనంగా మోపుతున్నారని దీనితో భారం మరింత తీవ్రమైనదన్నారు. ఆగస్టు 28 విద్యుత్ అమరవీరులు విద్యుత్ ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన రోజు అన్నారు. వారిని స్మరించుకుంటూ కరెంటు చార్జీలు తగ్గేవరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయడం వల్ల విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపుతుందన్నారు. కరెంటు చార్జీలతో ముడిపెట్టి అనేక సంవత్సరాల నుండి ఇస్తున్న పింఛన్లు,రేషన్ కార్డులను రద్దు చేయడం, అమ్మ ఒడి పథకాన్ని నిలిపివేయడం లాంటి చర్యలు చేపడుతున్నారన్నారు. తక్షణమే అర్హులందరికీ పింఛన్లు,రేషన్ కార్డులు, ఇల్లు,ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 30,31 తేదీలలో ఇంటింటికి తిరిగి ప్రజల సంతకాల సేకరణలో చేపడతామని, సెప్టెంబర్ 01-02 తేదీలలో సచివాలయాలు ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. సెప్టెంబర్ 4వ తేదీ భారీగా ప్రజలను సమీకరించి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. తక్షణమే పెంచిన కరెంటు చార్జీలను ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగేశ్వరరావు,షేక్ మస్తాన్ బి, సూర్యనారాయణ,నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ,కత్తి పద్మ పాల్గొన్నారు.










