ప్రజాశక్తి-విజయనగరం : ప్రజలందరినీ ఆరోగ్య వంతులుగా రూపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలం, మున్సిపాలిటీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్య శిబిరాలను నిర్వహిస్తోందని, వీటిని జిల్లా ప్రజలంతా వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలంలో రోజు విడిచి రోజు హెల్త్, వెల్‌నెస్ సెంటర్ స్థాయిలో ఈ శిబిరాలను నిర్వహిస్తారని, పిహెచ్‌సి వైద్యులతో పాటు చిన్నపిల్లలు, స్త్రీల ఆరోగ్య సమస్యలకు చెందిన వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్ కు సంబంధించిన ప్రత్యేక వైద్య నిపుణులు ఈ శిబిరాలకు హాజరై ఆయా వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేస్తారని వెల్లడించారు. శిబిరాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు పద్నాలుగు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వైద్యపరీక్షలు చేయించుకున్న వారికి మందులు కూడా అక్కడే అందజేస్తారన్నారు. వైద్య పరీక్షల సందర్భంగా తదుపరి చికిత్స అవసరమని వైద్యులు సిఫారసు చేస్తే వారికి వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించేలా జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ అధికారి, ఆ ప్రాంత వైద్యాధికారి నిరంతరం పర్యవేక్షణ చేస్తారని పేర్కొన్నారు.
ప్రసూతి మహిళలు, బాలింతలు, చిన్నపిల్లలు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడే వారు ఈ శిబిరాల్లో పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నందున వారికి శిబిరాల్లో వేచి వుండేందుకు కుర్చీల ఏర్పాటు, నీడనిచ్చేలా టెంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మందులు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఆరోగ్యశ్రీ కౌంటరు కూడా ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు రోగులకు తనిఖీలు చేసేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య శిబిరాలు ప్రారంభమయ్యేలోపే ఎఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు జరిపే కార్యక్రమాన్ని శతశాతం పూర్తిచేయాలని కోరారు.
జిల్లాలో 500 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు
జిల్లాలో ఈనెల 30 నుంచి నవంబరు 9వ తేదీ వరకు 500 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.భాస్కరరావు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వున్న 482 వెల్‌నెస్ సెంటర్ల పరిధిలో 482 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లోని 18 పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 18 శిబిరాలు కలసి మొత్తం 500 శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జెడ్‌పి సిఇఒ రాజ్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, తదితరులు మాట్లాడుతూ ఏర్పాట్లపై వివరించారు.










