Sep 13,2023 22:20

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌ నిశాంత్‌, జెసి గోవిందరావు, ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌

ప్రజాశక్తి-పార్వతీపురం : ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులో లేరని, ఇతర ప్రాంతాల నుండి అనుసంధానం చేయాలని కలెక్టర్‌ కోరారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు స్పందిస్తూ ఇప్పటికే స్పెషలిస్ట్‌ వైద్యులను అనుసంధానం చేశామన్నారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజల్లోకి ఇప్పటికే చేరిందని, మరింత అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అన్నారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తిస్తామన్నారు. వాలంటీర్లు ముందుగా ఈ నెల 15 నుంచి ఇంటింటికీ వెళతారని, తరువాత రోజు ఎఎన్‌ఎం, ఆశాల బృందం వెళ్లి పరీక్షలు నిర్వహించి, కేస్‌ షీట్‌ తయారు చేస్తారని చెప్పారు. వైద్య శిబిరాల షెడ్యూల్‌ ముందుగా తెలియజేస్తామన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం ఆరోగ్య బాధ్యత ఇందులో ఇమిడి ఉందని, దీనిని ప్రతిష్టాత్మకంగా ప్రాధాన్య తతో చేపడతామని ఆయన తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతోపాటు ఆరోగ్యశ్రీ ఉపయోగించుకునే విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిఎంహెచ్‌ఒ బగాది జగన్నాథరావు, డిసిహెచ్‌ఎస్‌ బి.వాగ్దేవి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, ఐసిడిఎస్‌ పీడీ కె.విజయగౌరి, మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామ అప్పలనాయుడు, జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం అధికారి ఎం.వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.