
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్స అందించడమే 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమ ధ్యేయమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజబాబు అన్నారు. మంగళవారం బంటుమిల్లి మండలం అర్థమూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఇంటి వద్దకే వైద్య సిబ్బందితో వచ్చి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మెరుగైన వైద్య సహాయం అందించే విధంగా కృషి చేస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో 30 రోజుల పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ప్రతిరోజూ వైద్య శిబిరాలు జరుగుతాయని, ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి ఒక స్పెషలిస్టు వైద్యుడు హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమస్యలను గుర్తించి ఎఎన్‌ఎంలకు సమాచారం అందించారన్నారు. ఎఎన్‌ఎంలు మళ్లీ ఇంటింటికీ తిరిగి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి వైద్య శిబిరానికి టోకెన్లు అందజేస్తారని తెలిపారు. ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే వైద్య శిబిరాల్లో 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంటాయన్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారని, అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి ఉచితంగా మందులిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ గీతాబాయి, ఇన్చార్జి ఆర్డీవో నారాయణరెడ్డి, స్పెషలిస్ట్ డాక్టర్ రంగనాథ్, స్పెషలిస్ట్ డాక్టర్ సురేఖ, బంటుమిల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విన్నకోట కామరాజు పవన్ సాయి, బంటుమిల్లి మండల వైద్యులు డాక్టర్ చేజర్ల సౌందర్య, డాక్టర్ కె.సువర్చల, డాక్టర్ వి.జయశ్రీ పాల్గొన్నారు.
టిడ్కో గహాల నిర్మాణ పనులు వేగవంతం
కృష్ణాజిల్లాలో టిడ్కో గృహాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గుడివాడ మల్లాయపాలెం, మచిలీపట్నం రుద్రవరం, గోశాల, ఉయ్యూరులలో టిడ్కో గృహాల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుడివాడ టిట్కో గహాల సముదాయంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆ దిశగా పనులు చేపట్టాలన్నారు. గుడివాడ మల్లాయపాలెం రెండు దశల్లోని 8912 గృహాల్లో ఇప్పటివరకు 6701 మంది లబ్ధిదారులకు, మచిలీపట్నం మండలం గో సంఘం లోని 864 గహాలలో 525 గృహాలను, ఉయ్యూరు మునిసిపాలిటీ పరిధిలో జెమినీ పాఠశాల ప్రాంగణంలో 1824 గృహాలకు 655 గృహాలకు, గండిగుంట ప్రాంతంలో 480 గృహాలకు 244 గృహాలకు రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందన్నారు. మిగిలిన గృహాలకు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో టిడ్కో ప్రాజెక్ట్ అధికారి చిన్నోడు, గుడివాడ మచిలీపట్నం, ఉయ్యూరు మునిసిపల్ కమిషనర్లు మురళీకృష్ణ, చంద్రయ్య, పి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.