ప్రజాశక్తి - కారెంపూడి : సరైన రహదార్లు ఉండవు.. విద్యుత్ లైట్లు ఎప్పుడు వెలుగుతాయో తెలియదు.. ఇంటి ఎదుట మురుగు నీరు నిత్యం దుర్గంధం వెదజల్లుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి.. జ్వరాలతో మంచం పట్టినా పారిశుధ్య పనులు చేసే దిక్కే ఉండదు.. మండలంలోని పేటసన్నిగండ్ల పంచాయతీ పరిధిలోని బేడ బుడగ జంగాల కాలనీలో 30 ఏళ్లుగా ఇదే దుస్థితిని స్థానికులు అనుభవిస్తున్నారు.
మంచి ఆదాయం ఉన్న పంచాయతీ పరిధిలోనే ఈ ప్రాంతమున్నా అభివృద్ధి మాత్రం తీసికట్టుగా ఉంది. 30 ఏళ్ల కిందట ఏర్పడిన ఈ కాలనీలో 150 కుటుంబాల వరకూ జీవనం సాగిస్తున్నాయి. అందరూ రెక్కాడితేగాని డొక్కాడని కూలీలే. ఈ కాలనీకి రహదార్ల సదుపాయం లేదు. మట్టిరోడ్లపైనే ఏళ్ల తరబడి రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం వస్తే వీరి బాధ వర్ణానాతీతం. డ్రెయినేజీ కాల్వలు లేకపోవడంతో కాలంతో సంబంధం లేకుండా నిత్యం ఇళ్ల ఎదుటే మరుగునీరు నిలిచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. అదె డ్రెయినేజీ నీళ్లలో నుండి తాగునీటి పైపులైన్లు ఉన్నాయి. పలువురు తరచూ రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఈ కాలనీలో 15 మందికిపైగా విషజ్వరాలతో మంచం పట్టారు. అయినా పారిశుధ్య పనులు చేపట్టిన దాఖలాలు లేవు. విద్యుత్ లైట్లు ఉన్నా అవి సరిగా వెలగడం లేదని, రహదార్ల వెంట పిచ్చి మొక్కలు పెరిగిన నేపథ్యంలో వాటిల్లో నుండి పురుగు, పుట్రా బయటకు వస్తాయోనని రాత్రి వేళలల్లో భయభయంగా రాకపోకలు సాగించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదనకు గురవుతున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికలప్పుడు హామీలిస్తున్న నాయకులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఇక్కడివారు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
రెండు నెలల కిందట ఈ ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఎమ్మెల్యే ఎదుట స్థానికులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున మంజూరయ్యే నిధుల్లో రూ.10 లక్షలను ఈ కాలనీలో అభివృద్ధి పనులకు వెచ్చించాలని ఎమ్మెల్యే ఆదేశించారని, అయినా ఫలితం లేకపోయిందని స్థానికులైన పెల్లూరి పెద్ద లింగయ్య, భిక్షం వెంకటేష్, ఆలేటి వెంకటేష్, తిరుపతయ్య, శ్రీపాటి భిక్షం ఆవేదనకు గురయ్యారు. దీనిపై సర్పంచ్ నాగేంద్రను వివరణ కోరగా కాలనీని పరిశీలిస్తామని, స్థానికులకు ఇబ్బందులేమీ లేకుండా సమస్య పరిష్కారానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు.










