ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఈనెల 30, 31 తేదీల్లో సిపిఎం చేపడుతున్న ఇంటింటి ప్రచారం, సంతకాల సేకరణను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యాలయంలో మండల ముఖ్యకార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల కమిటీ సభ్యులు జోడే సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎ.రవి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజలు కొనుగోలు చేసే నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచిఅంబానీ ఆదానీలకు దేశ సంపదను దోచిపెడుతుందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రయివేటీకరణ విధానాల వల్ల దేశంలో చిన్నపరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతపడ్డాయని తద్వారా దేశంలోని 80 శాతంగా ఉన్న యువత ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దేశంలోని విద్యుత్‌రంగాన్ని అదానికి కట్టబెట్టారని దీనిద్వారా ప్రజలందరిపై విద్యుత్‌భారాల మోపి ప్రజల సొమ్మును కార్పొరేటర్లకు, పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. ఇంతజరుగుతున్నా సిఎం జగన్ నోరుమెదపకపోవడం సిగ్గుచేటని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం సిఎం జగన్ అఖిలపక్షాలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, వైసిపి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే సిపిఎం ఆధ్వర్యంలో అనేకమార్లు దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టామని, ప్రభుత్వం పెంచిన ధరలు, మోపిన భారాలు తగ్గించకుండా దున్నపోతు మీద వాన కురిసినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం, సంతకాలు సేకరణతో ప్రజల మద్దతు కూడగడతామని తెలిపారు. వచ్చేనెల ఒకటి, రెండు తేదీల్లో గ్రామ సచివాలయాల వద్ద ధర్నాలు చేస్తామని, అప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే ప్రజలందరినీ ఐక్యంచేసి ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి ఎం.జీవరత్నం, కమిటీ సభ్యులు జి.సూర్యకిరణ్, ఎ.ప్రభాకర్‌రావు, జి.రాంబాబు, బి.రాంబాబు, యాగంటి సీత, పటాన్ మస్తాన్, కె.సుబ్బారావు పాల్గొన్నారు.










