ప్రజాశక్తి - కాకినాడ
జిల్లాకు కొత్తగా వచ్చిన ఇవిఎంలు, వివిప్యాడ్‌ల పనితీరును ఈ నెల 3 నుంచి బెల్ ఇంజినీర్లు పరిశీలించనున్నారని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మంగళవారం కాకినాడ పాత బస్టాండు సమీపంలో ఉన్న అంబేద్కర్ భవన్‌ను కలెక్టర్ కృతికాశుక్లా, రెవెన్యూ, ఎన్నికలు, సోషల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాకు సంబంధించి ఇవిఎం, వివిప్యాడ్‌ల తొలిదశ పరిశీలన ప్రక్రియ 20 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు అంబేద్కర్ భవన్‌ను ఎంపిక చేశామన్నారు. బెంగళూరు నుంచి బెల్ కంపెనీకి చెందిన 15 మంది ఇంజనీర్ల బృందం ఈ ప్రక్రియలో పాల్గొంటుందని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలోని రెవెన్యూ, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో పాటు ఎంపిడిఒ కార్యాలయ సిబ్బందికి కూడా విధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు స్వయంగా వచ్చి ప్రక్రియను పరిశీలించొచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట డిఆర్‌ఒ కె.శ్రీధర్‌రెడ్డి, ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణ, సోషల్ వెల్ఫేర్ జెడి డివి.రమణమూర్తి, అర్బన్ తహశీల్దార్ పి.సీతాపతిరావు ఉన్నారు.










