ప్రజాశక్తి-అనకాపల్లి, బుచ్చయ్యపేట
ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు గుంటూరులో అగ్రిటెక్-2022 ఆధునిక సాంకేతికతపై ప్రదర్శన, కిసాన్ మేళ జరుగుతుందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ పివికె.జగన్నాథరావు, బుచ్చయ్యపేట మండలం కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ ఎన్.రాజ్‌కుమార్ తెలిపారు. ఆర్‌ఎఆర్‌ఎస్‌లో శనివారం విలేకర్ల సమావేశంలో జగన్నాథరావు మాట్లాడగా, రాజ్‌కుమార్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 10వేల మంది ఈ ప్రదర్శన, మేళ్లకు హాజరవుతారని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల నుంచి సుమారు 250 మంది ఆదర్శ రైతులు పాల్గొంటున్నట్లు తెలిపారు. వివిధ వ్యవసాయ ఉత్పత్తులపై 300 నుంచి 400 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సులో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలు, సహకార, ఇతర బ్యాంకింగ్ సేవలు, మెకనైజేషన్ యాక్సిస్బిలిటీ ఫార్మర్స్, రైతులు శాస్త్రవేత్తల చర్చ గోష్టి, వ్యవసాయ, ఉద్యానవన సమీకృత వ్యవసాయ విధానం, రైతులు మార్కెట్ లింకేజీ, సీడ్ ప్రొడక్షన్, క్రిమిసంహారక మందులు, సేంద్రీయ వ్యవసాయ విధానం, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యంత్రాలు, పంటకోత అనంతర విధానం, రోబోటిక్ అగ్రికల్చర్ ఆపరేషన్, రైతు భరోసా కేంద్రాల సేవలు, రైతు ఉత్పత్తి సంఘాలు, మార్కెట్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనకాపల్లి నుంచి బెల్లం ఉత్పత్తులపై స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.










