ప్రజాశక్తి-అనకాపల్లి
2023 జనవరి 3వ తేదీ నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఓటర్ల జాబితా పరిశీలకులు పి.భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త ఓటర్ల మార్పులు చేర్పులు, తొలగింపులు పూర్తి చేయాలన్నారు. బూత్ స్థాయి అధికారులు సమర్పించిన రికార్డులను చూడాలని, ఓటర్లలో స్త్రీ పురుష నిష్పత్తి, ఓటర్ల నిష్పత్తి రాష్ట్రస్థాయి నిష్పత్తికి సమానంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పఠాన్ శెట్టి మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన కొత్త ఓటర్లు సుమారు 15 వేల వరకు వచ్చాయని, తొలగింపులు 10 వేల వరకు ఉన్నాయని తెలిపారు. ఫారం-7 క్లైములు 1208 కాగా 99 శాతం పూర్తి అయ్యేయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, నర్సీపట్నం ఆర్‌డిఒ, జిల్లాలోని నియోజకవర్గాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.










