షర్మ్ ఎల్ షేక్, ఈజిప్ట్ : ఆసియాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబి)లో తాజాగా మరో మూడు దేశాలు చేరాయి. అవి ఎల్ సాల్వడార్, సోలోమన్ ఐలండ్స్, టాంజానియా. మంగళవారం నాడిక్కడ జరిగిన ఎఐఐబి ఎనిమిదవ వార్షిక సమావేశంలో బ్యాంక్ గవర్నర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపినట్లు ఆ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ బ్యాంక్‌లో చేరిన దేశాల సంఖ్య 109కి పెరిగింది. సభ్య దేశాలతో ఎఐఐబి సహకారం మరింత బలోపేతం అయిందనడానికి ఇదొక ఉదాహరణ. ఎఐఐబి ఈ విషయంలో ఇప్పటికే మంచి రికార్డు కలిగివుందని బ్యాంక్ అధ్యక్షుడు, డైరెక్టర్ల బోర్డు చైర్మన్ జిన్ లిక్వన్ తెలిపారు. తాజాగా మూడు ఆర్థిక వ్యవస్థలు చేరడంతో ఎఐఐబి కమ్యూనిటీ మరింత బలోపేతమైందని అన్నారు.. రేపటి అవసరాల కోసం మౌలిక సదుపాయాలకు ఆర్థిక సాయాన్ని అందించాలనే ఉమ్మడి కర్తవ్యానికి మద్దతుగా నిలుస్తాయన్నారు. అవసరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారికంగా ఈ మూడు దేశాలు ఎఐఐబిలో చేరతాయని బ్యాంక్ తెలిపింది.