
* సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : డిసెంబరు 3,4 తేదీల్లో శ్రీకాకుళంలో జాతీయ సెమినార్‌ను నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సిఐటియు జాతీయ నాయకులు పర్సా సత్యనారాయణ శత జయంత్యుత్సవాలు సందర్భంగా సిఐటియు ఆధ్వర్యాన్న నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ జాతీయ సెమినర్‌కు సిఐటియు జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత, రాష్ట్రంలో వివిధ కార్మికోద్యమ నాయకులు, కార్మికులు హాజరు కానున్నారని తెలిపారు. పాలకులు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, సమస్యలు పరిష్కారం, హక్కుల పరిరక్షణకు సిఐటియు అనేక పోరాటాలు చేస్తోందని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్, పోస్టల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు నిర్వహిస్తున్న ఐక్య ఉద్యమం వల్లే ప్లాంట్ ప్రయివేటీకరణ మూడేళ్లుగా జరగలేదని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కోసం పోరాడుతోంది సిఐటియునేనని అన్నారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇవ్వాలని చేసిన పోరాటాలకు మద్దతుగా నిలబడిందన్నారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు సిఐటియు నిర్వహించిందని గుర్తుచేశారు. కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మారుస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి.సుధ, ఎపి ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.అమరావతి, సిఐటియు జిల్లా నాయుకులు ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.వి.రమణ, కె.సూరయ్య, ఎన్.గణపతి, హెచ్.ఈశ్వరరావు పాల్గొన్నారు.