- కాజేసిన నిధులు పంచాయతీల ఖాతాకు జమ చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై సిబిఐ విచారణ చేయాలి
- సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్ తెలిపారు. నగరంలోని పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యాన రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతినిధి బృందం చలో ఢిల్లీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ కార్యదర్శి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఆర్థిక సంఘం నిధులు రూ.8,660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా ఖాతాల నుంచి దారిమళ్లించి తన సొంత అవసరాలకు వినియోగించుకుందన్నారు. 2022-23 సంవత్సరానికి చెందిన రూ.2010 కోట్లు, 2023-24 సంవత్సరాలకు చెందిన రూ.2,035 కోట్లు మొత్తం రూ.4,045 కోట్లు పంచాయతీలకు విడుదల చేయకుండా అన్యాయం చేశారన్నారు. ఉపాధి హామీ చట్టం కింద వచ్చే నిధులు చట్టప్రకారం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లను హైజాక్ చేసి తన సొంత అవసరాలకు, పథకాలకు వాడుకుంటున్న విషయం గురించి వివరించామన్నారు. భారత రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం ఏర్పడిన గ్రామ పంచాయతీలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలను, వార్డు మెంబర్లను డమ్మీలను చేస్తూ వారి అధికారాలను రాజ్యాంగేతర శక్తులైన గ్రామ వాలంటీర్లకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అలికాం సర్పంచ్ ప్రతినిధి రంధి అప్పలస్వామి, బైరివానిపేట సర్పంచ్ బైరి నరేష్, అలికాం ఎంపిటిసి వాడాడ నాగేశ్వరరావు, సింగుపురం ఎంపిటిసి పంగ సత్యనారాయణ, సానివాడ సర్పంచ్ రుప్ప లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










