ప్రజాశక్తి - పలాస: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగస్టు రెండో తేదీన జిల్లాలో పర్యటించే అవకాశముందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. పర్యటనలో భాగంగా పలాసలోని 200 పడకల ఆస్పత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాశీబుగ్గ కిడ్నీ పరిశోధనా కేంద్రం వద్ద 16 అడుగుల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ పరిశోధనా కేంద్రానికి వైఎస్‌ఆర్ రీజనల్ రీసెర్చ్ సెంటర్‌గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే 200 పడకల ఆస్పత్రితో పాటు కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పటికే వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించామని, ఈ నెలాఖరులోగా సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ.700 కోట్లతో ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు చేపడుతున్న పనులు పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.గిరిబాబు, వైస్ చైర్మన్లు బోర కృష్ణారావు, మీసాల సురేష్‌బాబు, పలాస ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీర్ భవానీ శంకర్, ఎఎంసి చైర్మన్ పి.వి సతీష్, మందస ఎంపిపి డొక్కరి దానయ్య, దురాశంకర్ పండా తదితరులు పాల్గొన్నారు.










