
ప్రజాశక్తి-గుంటూరు : రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలని, తదితర డిమాండ్లపై డిసెంబరు 2న తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న 'రజకుల రాష్ట్రగర్జన సభ'ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజకవృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలైనా రజకులపై అగ్రవర్ణ పెత్తదారులు దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రజకుల వృత్తి చెరువులు కుంటలు కమ్యూనిటీ హాలు స్థలాలు రజకులకే కేటాయించాలని, 50 సంవత్సరాలు నిండిన రజకులకు వృద్ధాప్యం పెన్షన్ ఇవ్వాలని కోరారు. సమావేశానికి బల్లగిరి శివరామయ్య అధ్యక్షత వహించారు. తాడేపల్లి గూడెంలో జరిగే సభలో రజక ఉద్యోగులు, కార్మికులు, వృత్తిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమవేశంలో సహాయ కార్యదర్శి బి.సుబ్బారావు, యం.వెంకట నరసయ్య, పి.శ్రీనివాస్, ఎం.సుబ్బారావు, పి.సాంబశివరావు, పి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.