Sep 28,2022 23:10

వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వచ్చేనెల 2న సాయంత్రం విశాఖ సాగరతీరం పార్క్‌ హోటల్‌ నుంచి ఆర్‌కె బీచ్‌ వరకు ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తెలిపింది. బుధవారం సెంట్రల్‌ స్టోర్స్‌ కూడలిలో పోరాట కమిటీ పాదయాత్ర వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నేతలు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరాం, నీరుకొండ రామచంద్రరావు, వై.మస్తానప్ప తదితరులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును నూటికి నూరుశాతం అమ్ముతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమన్నారు. ఉద్యమాలు, ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పాటైన ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 2న పాదయాత్రలో కార్మికవర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నేతలు మసేన్‌రావు, డొక్కా నర్సింగరావు , విల్లా రామ్మోహన్‌కుమార్‌, బొడ్డు పైడిరాజు, పి.ప్రసాద్‌, సన్యాసిరావు, కరణం సత్యారావు, బి.డేవిడ్‌, నమ్మి సింహాద్రి, కారు రమణ, వరసాల శ్రీనివాసరావు, గుమ్మడి నరేంద్రకుమార్‌ పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగంలోనే స్టీల్‌ప్లాంట్‌ కొనసాగించాలి
గాజువాక
: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఎఐటియుసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మసేన్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం పెదగంట్యాడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వచ్చేనెల 2న విశాఖ బీచ్‌లో నిర్వహించనున్న ఉక్కు సత్యాగ్రహ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎల్లేటి శ్రీనివాసరావు, వేంపాడ గోవిందరెడ్డి, వెంకటరమణ, సింహాద్రి, మరి నాయుడు పాల్గొన్నారు.