29న విజయవాడలో మహాధర్నా
- జయప్రదం చేయండి : కెవిపిఎస్, వ్యకాసం
ప్రజాశక్తి - వెలుగోడు
ఈనెల 29న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కెవిపిఎస్, ఎపి వ్యకాసం నాయకులు కోరారు. గురువారం వెలుగోడులోని సిఐటియు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రామదాసు, వెలుగోడు సిఐటియు మండలం అధ్యక్షులు వి. నాగమోహన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన నేటికీ దళితులపైన హత్యలు, అత్యాచారాలు, దాడులు దళిత మహిళల పైన మానభంగాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. దళితుల అభివద్ధి కోసం సాధించుకున్న భూ పోరాట చట్టాలను, అసైన్డ్ మెంట్ 7/99 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసి దళితుల చేతుల్లో ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ఈ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. కుల వివక్షత, అంటరానితనాన్ని రూపుమాపుటకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రచార క్యాంపెయిన్ నిర్వహించి, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం ప్రకారం బడ్జెట్ లో పక్కదారి పట్టించిన నిధులను తిరిగి కేటాయించి మరలా దళితులకే ఖర్చు చేయాలన్నారు. రాష్ట్రంలో స్మశానంలో గుంతలు తీసే కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి, వారికి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రతి నెల 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నారు. డప్పు కళాకారులకు ప్రతి నెల 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నారు. డప్పు కళాకారులకు పెన్షన్ వయస్సు 40 సంవత్సరములకు తగ్గించాలన్నారు. డప్పు కళాకారుడు మరణిస్తే జీవిత బీమా సౌకర్యం రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. చర్మకారులకు ప్రతి నెల రూ.4000 పెన్షన్ ఇచ్చి, పెన్షన్ వయస్సు35 సంవత్సరములకు తగ్గించాలన్నారు. దళితులకు దళిత పేటలో గ్రామాలలో స్మశానాలు లేని గ్రామాలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెవిపిఎస్ పోరాడి సాధించుకున్న స్మశానాల జీవో నెంబర్ 1235 ప్రకారం దళితులకు రెండు ఎకరాలు స్మశాన భూమి కేటాయించాలన్నారు. పై సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 29న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు వి.కిషోర్, పి.కృష్ణ, యల్. గౌరీ, టీ.జాషువా, ఎల్ శేఖర్, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి. వెంకటయ్య, ఎస్.నబి రసూల్,ఎస్. నూరుల్లా, మోదీన్, దేవరాజు, శివకుమార్, బడేసా తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న నాయకులు