Sep 17,2023 23:18

సమావేశంలో మాట్లాడుతున్న ఈమని అప్పారావు

ప్రజాశక్తి-మంగళగిరి : వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 29వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నాలో వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అన్నారు. 'దళితుల సమస్యలు - పరిష్కార మార్గాలు' అంశంపై స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి కెవిపిఎస్‌ పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌ అధ్యక్ష వహించారు. అప్పారావు మాట్లాడుతూ దళితుల పట్ల వివక్ష రోజుకు పెరిగిపోతోందని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకుందని విమర్శించారు. దళితులపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని విమర్శించారు. శ్మశాన స్థలాల్లేక దళితులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బి.కోటేశ్వరి, సిఐటియు నాయకులు జెవి రాఘవులు, ఎస్‌ఎస్‌ చెంగయ్య, టి.శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.బాలాజీ, కెవిపిఎస్‌ నాయకురాలు ఇ.విజయలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇ.కాటమరాజు, పి.అప్పారావు, సంజీవరావు, వెంకటేశ్వరావు పాల్గొన్నారు.