Sep 16,2023 21:54

సదస్సులో మాట్లాడుతున్న కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్‌ బాబు

29న విజయవాడలో మహాధర్నా
- జయప్రదం చేయండి : కెవిపిఎస్‌, వ్యకాసం
ప్రజాశక్తి - నంద్యాల

     దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఈ నెల 29న విజయవాడలో జరిగే మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివ నాగరాణి, కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్‌ బాబు పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలోని సిపిఎం కార్యాలయంలోని నరసింహయ్య భవనంలో కెవిపిఎస్‌, వ్యకాసం ఆధ్వర్యంలో శనివారం దళితుల హక్కులు-సామాజిక న్యాయం' అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివ నాగరాణి, కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్‌ బాబులు హాజరై మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో దళిత, గిరిజనులకు, ఇతర వెనుకబడిన కులాల వారి సంక్షేమ కోసం ఏమీ చేయలేదన్నారు. మనువాద సిద్ధాంతాలను అమలు చేస్తూ మతాల పేరుతో దాడులు చేస్తున్నారన్నారు. ఆధునిక కాలంలో కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చి దేశం పురోగమించ కుండా తిరోగమనంవైపు తీసుకెళ్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు చేస్తూ దళిత, గిరిజనులకు ఉపాధి లేకుండా గతంలో ఇచ్చిన అసైన్మెంట్‌ భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని పూర్తిగా మూసివేశారన్నారు. దళిత మహిళలపై దాడులు, ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ నీరు గార్చే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. భూ రీ సర్వే పేరుతో మిగులు భూములను ఉన్నవాళ్లకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేయడం మానుకొని భూమి లేని ప్రతి దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాలకు రెండు ఎకరాలు ఇవ్వాలన్నారు. ఈ సమస్యలపై నంద్యాల జిల్లాలో నాలుగు రోజులు పాటు జీపు చైతన్య యాత్రలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 29న విజయవాడలో జరిగే మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరావు, ఎం.సుధాకర్‌, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగమ్మ, రామదాసు, నాయకులు ఈశ్వరయ్య, నరసింహ నాయక్‌ ,చెన్నయ్య, కర్ణ, రాములమ్మ, హైమావతి, కరిముల్లా, హుస్సేనమ్మ, ఏసేపు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.