Oct 13,2023 22:35

29న వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభం

29న వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి-తిరుపతి సిటి
తిరుపతి నగరంలో నూతనంగా రూపుదిద్దుకుంటున్న వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభానికి సిద్దమవుతోందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున తెలిపారు. ఈ నెల 29న వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభం సందర్బంగా ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రాత్ణస్మరనీయుడు వేమనని, సమాజంలోని రుగ్మతలపై అక్షరాన్ని పద్యరూపంలో ఝుళిపించిన మహానీయుడని, మన కన్నా 350 ఏళ్ల ముందు జీవించిన వేమన నాడు రాసిన పద్యాలు నేటికీ మన నాలుకలపై నాట్యం చేస్తున్నాయంటే అప్పటి పరిస్థితులు ఇప్పటికీ మారకుండా కొనసాగుతున్నాయన్నారు. అందుకే వేమన సమకాలీన కవి అని తెలిపారు. అలాంటి వేమన పేరుతో తిరుపతి నగరంలో విజ్ఞాన కేంద్రం పని చేస్తూ, ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలలో చురుకైన పాత్ర నిర్వహిస్తోందన్నారు. తిరుపతి బాలోత్సవం పేరుతో తిరుపతి జిల్లాలోని వేలాది మంది విద్యార్థులలో వేమన దృక్పథాన్ని పరిచయం చేసింది. కరోనా సమయంలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని నడిపి ఆదుకుంది. ఓ గ్రంథాలయాన్ని, ఆరోగ్య సలహా కేంద్రాన్ని నడుపుతున్నదని గుర్తు చేశారు. ఈ విజ్ఞాన కేంద్రం ప్రజల్లో శాస్త్రీయ భావనలకు తోడ్పడే సాధనంగా కృషి చేస్తుందని తెలిపారు. తిరుపతిలో వేమన విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ భవనాన్ని సమకూర్చుకుందని పేర్కొన్నారు. ఇందులో రెండు సభా మందిరాలు ఏర్పాటు చేశామన్నారు. యశోదనగర్‌లో నూతనంగా రూపొందించిన ట్రస్ట్‌ భవనాన్ని ఈ నెల 29వ తేదిన ప్రారంబించనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెంచంద్రశేఖర్‌రెడ్డి భవనాన్ని ప్రారంభిస్తారని, ముఖ్యఅతిథిగా ప్రముఖ పాత్రికేయులు, విశ్లేషకులు తెలకపల్లి రవి, సమతా సావప్నికుడు వేమన పుస్తకావిష్కరణకు ఆవిష్కర్తగా మాజి ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం హాజరవుతారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతంగా సిద్దమవుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే లైటింగ్స్‌, పెయింటింగ్స్‌ తదితర పనులు పూర్తయ్యాయని, ఆలంకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. భవన ప్రారంభానికి సాహితీ ప్రేమికులు, సమాజ శ్రేయోభిలాషులు అందరూ తప్పక రావాలని కోరారు.