ప్రజాశక్తి - శ్రీకాకుళం: మహిళలపై జరిగే హింసను అరికట్టాలని, మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలని తదితర డిమాండ్లతో మహిళా పోరు (బస్సు) యాత్రను ఈనెల 29న జిల్లాలో నిర్వహిస్తున్నట్లు ఐద్వా జిల్లా కన్వీనర్ అల్లాడ లక్ష్మి, నగర కన్వీనర్ శ్రీదేవి పాణిగ్రహి తెలిపారు. పోరుయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని చల్లావీధి కమ్యూనిటీ హాల్ వద్ద పోరుయాత్ర పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింసను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ధ్వజమెత్తారు. మహిళలపై ఎన్నో దాడులు జరుగుతున్నా, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటులో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. మద్యం, మత్తు పదార్థాలకు యువత జీవితాలు నాశనమవుతుంటే, మత్తు పదార్థాల మాఫియాలకు ప్రభుత్వాలే అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. మహిళలపై హింసను అరికట్టే దిశగా నేరాలను అధ్యయనం చేయడానికి నిపుణులతో కమిటీ వేయాలని, మద్యం మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈనెల 29న శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద నిర్వహించే సభకు యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు ఎం.లలిత, విమల, సరోజని, లక్ష్మి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.










