ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, దళితులకు న్యాయం చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వ్యకాస జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక అన్నే భవనంలో ఎం.ఇస్సాక్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పి.రామకృష్ణ, బికెఎంయు నేత బండి వెంకటేశ్వరరావు, కెవిపిఎస్ నాయకులు బాలరాజు, అంబేద్కర్ ఆలోచన వేదిక నాయకులు ఎం.సంతోష్‌కుమార్, డిబిఆర్‌సి నాయకులు సింగవరపు జ్యోతి, దళిత సంఘాల నాయకులు రవికుమార్ మాట్లాడుతూ మణిపూర్‌లో మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారం చేయడం యావత్ భారతావని తలదిచుకునేల చేసిందని మండిపడ్డారు. ఇంత జరిగినా మతోన్మాద ప్రధానమంత్రి మోదీ నోరెత్తకపోవడం, దాడులకు పాల్పడినవారికి రక్షణ కల్పించడం అత్యంత సిగ్గుచేటున్నారు. దళితులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప వారిని మనుషులుగా చూడడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా దళితులకు ద్రోహం చేస్తుందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దళితుల హక్కులు - సామాజిక న్యాయం కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టామని తెలిపారు. ఈ నెల 29న విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆందోళనలో దళితులు, ప్రజాతంత్రవాదులు, కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. దళితుల సామాజిక హక్కులకు, ఆర్థిక డిమాండ్లు పక్కదారి పట్టించిన ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులను తిరిగి కేటాయించి దళితులకే ఖర్చు చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్‌పిసి ప్రకారం బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు, హత్యలు, స్త్రీలపై అత్యాచారాల కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టి.సత్యనారాయణ, రాజశేఖర్, చంటి, కె.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.










