
ప్రజాశక్తి-ఎస్.రాయవరం:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారానికి ఈ నెల 29న అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యమ్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండలంలో జేవి పాలెం గ్రామంలో ఉపాధి పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన కూలీలతో
మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా చట్టంలో ఉన్న సదుపాయాలు తగ్గిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో రెండు లక్షల కోట్ల నిధులు పెంచాలని, గతంలో ఇస్తున్న 50శాతం వేసవి అలవెన్స్, పారలు, గుణనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీడకు టెంట్లు, మెడికల్ కిట్లు, మజ్జిగ పంపిణీ చేసి పాతపద్ధతిలోనే పనులు నిర్వహించాలన్నారు. పే షిప్‌లు ఇచ్చి, ప్రతివారం పేమెంట్లు చేయాలన్నారు. ఈ సమస్యలపై చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ఉపాధి కూలీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయుడు, మంగ, కూలీలు తదితరులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్:ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 29న అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు వివి శ్రీనివాసరావు, మండల నాయకులు ఎస్ బ్రహ్మాజీ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వద్ద గల పెద్ద కాలువ, పురిటి గడ్డ, పేటకట్టు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలను శుక్రవారం కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరపత్రాలను అందజేసి, వారితో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, బ్రహ్మాజీ మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. 9 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తుందన్నారు. ఈ ఏడాది మరీ అన్యాయంగా రూ.20 వేల కోట్లు తగ్గించిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో రోజురోజుకు పనులు తగ్గిపోవడంతో ఉపాధి పనులు పట్ల కూలీలు మొగ్గు చూపడంతో సంఖ్య పెరిగిందని, ఈ నేపథ్యంలో బడ్జెట్లో నిధులు పెంచవలసింది పోయి తగ్గించడం దారుణమన్నారు.
కె.కోటపాడు : మండలంలోని గుల్లేపల్లి గ్రామంలో ఉపాధి పని జరుగుతున్న చెరువు వద్దకు ప్రజా సంఘాల మండల కన్వీనర్ ఎర్ర దేవుడు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గాడి ప్రసాదు శుక్రవారం వెళ్లి కూలీలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టకొడుతుందని విమర్శించారు. ఉపాధి నిధులను వేరే పనులకు మళ్లించరాదని, ప్రతి కుటుంబానికి ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని, మంచినీళ్లు, పనిముట్లకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటి సాధనకు కలెక్టరేట్ వద్ద 29న జరిగే ధర్నాకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్ల జయరాం, లక్ష్మి, సిరికి అంజమ్మ, రాళ్లపల్లి లక్ష్మి, జి ఈశ్వరమ్మ, మల్ రెడ్డి చంద్రిక, లీల, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.