ప్రజాశక్తి- అమలాపురం
దళితుల హక్కులు- సామాజిక న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టామని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి అన్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 29న విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామని ఈ ఆందోళన పోరాటంలో దళిత ప్రజాసంఘాలు ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం దళిత హక్కుల పరిరక్షణ కోసమై మంగళవారం ఎపి వ్యవసాయకార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో అమలాపురం నుంచి ముమ్మిడివరం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమలాపురం హై స్కూల్ సెంటర్ నుంచి ప్రారంభించి గడియార స్తంభం, నల్లవంతెన, ఎర్రవంతెన, బట్నవిల్లి, అనాతవరం, మహిపాల చెరువు, ముమ్మిడివరంలోని వివిధ గ్రామాల్లో ఈ బైక్ ర్యాలీ సాగింది. కార్యక్రమానికి అండ్రా మాల్యాద్రి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నేటికి దళితుల పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. మణిపూర్లో జరిగిన ఘటనలపై ప్రధానమంత్రి మోదీ పల్లెత్తు మాట మాట్లాడకపోగా దాడులు చేసిన ద్రోహులకు రక్షణ కల్పించడం అత్యంత సిగ్గు చేటన్నారు. బిజెపి కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. రిజర్వేషన్లను అమలు చేయకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. మన రాష్ట్రంలో కూడా రోజురోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. దళితుల హక్కులను పాలక వర్గాలు కాలరాస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర ఉపాద్యక్షలు కారెం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గా ప్రసాద్, దళిత ప్రజా సంఘాల నాయకులు వడ్డి నాగేశ్వరరావు, యల మంచులు బాలరాజు, కెవిపిఎస్ ఉపాధ్యక్షలు ఎస్.తులసీరావు తది తరులు మాట్లాడారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు జి.హరీష్ జి.మురళి, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాద్యక్షలు పాము బాలయ్య కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు టి మోహనరావు, భీమాల శ్రీను, డివిఎస్‌ఎన్. శ్రీనివాస్, తాడి శ్రీరాంమూర్తి, పర్వతాలు సిద్ధార్థ, గెడ్డం విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.










