ప్రజాశక్తి - రాంబిల్లి : నేేవల్ బేస్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యమ జెఎసి ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళన ఆదివారం 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమ జెఎసి నేతలు మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన హామీలన్నీ విస్మరించి, కొత్తపట్నం, వాడ నరసాపురం గ్రామాల మత్స్యకారులను చేపల వేటకు వెళ్ళనీయకుండా నేవీ అధికారులు గేట్లు బంధించి ఉపాధిని దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస కాలనీ నాయకులు మాట్లాడుతూ నేవల్ బేస్ నిర్మాణంతో ఇళ్లు, భూములు, ఇతర ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులంందరికీ ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఇచ్చిన హామీ 17ఏళ్లు పూర్తయినా నేటికీ కార్యరూపం దాల్చకపోవడం దారుణమన్నారు. నేవల్ బేస్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన చిన్న కలవలపల్లి,కొత్తపేట, గోవింద పాలెం, వాడపాలెం గ్రామాల ప్రభావిత ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమస్యల్ని పరిష్కరిస్తాం.. ధర్నా విరమించండి : అధికారులు
ధర్నా శిబిరాన్ని అనకాపల్లి ఆర్‌డిఒ చిన్నికృష్ణ, మత్స్యశాఖ జెడి లక్ష్మణరావు సందర్శించి ఆందోళనకారులతో మాట్లాడారు. నిర్వాసితుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారన్నారు. పెండింగ్ ప్యాకేజీలు చెల్లింపుతోపాటు ప్రభావిత గ్రామాల్లో రోడ్ల నిర్మానం, అందరికీ ఉపాధి కల్పన, నేవీ కారట్రాక్టు పనుల కల్పన, జెఎసి నేతలపై పెట్టిన కేసులను జిల్లా ఎస్‌పితోమాట్లాడి తొలగింపునకు చర్యలు చేపట్టడం పెండింగ్ గంపల ప్యాకేజీ చెల్లింపు వంటి సమస్య పరిష్కారం, సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టేందుకు ప్రభావిత గ్రామాల్లో సోమవారం నుంచే సర్వే నిర్వహిస్తామని భరోసానిచ్చారు. సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు ద్వారా కొంత సమయం పడుతుందని, నేవల్ బేస్ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృతనిశ్చయంతో ఉందని, ఆందోళనను విరమించాలని కోరారు.
దీనిపై జెఎసి నేతలు స్పందిస్తూ దాదాపు నెలరోజుల పాటు తాము ఆందోళన చేస్తుంటే, డిమాండ్లలో ఒక్కదానినైనా నెరవేర్చేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనను విరమించి, టెంట్ ఎత్తేయాలని అధికారులు కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమస్య శాశ్వతంగా పరిష్కారమౌతుందని నమ్మకం కలిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్‌డిఒ, ఫిషరీస్ జెడి చెప్పిన మాటలను గౌరవించి, సోమవారం నిర్వహించతలపెట్టిన తహశీల్దార్ కార్యాలయం ముట్టడిఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జి దేవుడునాయుడు, ఎనిమిది గ్రామాల జెఎసి పెద్దలు, వేలాదిమంది నిర్వాసితులు పాల్గొన్నారు.










