Aug 22,2023 22:42

సమావేశంలో మాట్లాడుతున్న మోహనరావు

* జీడికి మద్దతు ధర కల్పించాలి
* 108 గ్రామాల నుంచి 82,500 సంతకాల సేకరణ
* రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు
ప్రజాశక్తి - పలాస: 
జీడికి మద్దతు ధర కల్పించాలని, ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ ఈనెల 28న మోటార్‌ సైకిల్‌ యాత్రను చేపట్టనున్నట్లు ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ వెల్లడించారు. ఈ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాశీబుగ్గలోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 80 కేజీల జీడి పిక్కలకు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. జీడి మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ లక్ష సంతకాల సేకరణలో భాగంగా ఇప్పటివరకు 14 మండలాలు, 108 గ్రామాల్లో 82,500 మంది రైతుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సంతకాల సేకరణకు గ్రామాల్లో రైతుల, జీడి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. లక్ష సంతకాల సేకరణకు మద్దతుగా ఈనెల 28న కంచిలిలో బైక్‌ ర్యాలీని ప్రారంభించి కవిటి, సోంపేట, మందస, హరిపురం, కాశీబుగ్గ మీదుగా పలాస చేరుకుని ఆర్‌డిఒకు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతుసంఘం వజ్రపుకొత్తూరు మండల కార్యదర్శి తమ్మినాన భాస్కర్‌, కె.బాలాజీ, కుత్తుం వినోద్‌, కొర్ల హేమారావు చౌదరి, కోనేరు గురయ్య, కారి పురుషోత్తం, కుత్తుం ఢిల్లీరావు, సిఐటియు నాయకులు దిలీప్‌ పాల్గొన్నారు.