ప్రజాశక్తి - పలాస
80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించాలని, ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28వ తేదీన కాశీబుగ్గలోని గాంధీ విగ్రహం వద్ద 24 గంటల సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నట్లు ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతుసంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్ తెలిపారు. ఈ దీక్షను మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్ శర్మ ఆరోజు ఉదయం పది గంటలకు ప్రారంభిస్తారని చెప్పారు. జీడి రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాశీబుగ్గలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జీడి పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి మద్దతు ధరకు మూడు నెలలుగా పలురూపాల్లో నిరసనలు చేపడుతున్నా, ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. జీడికి మద్దతు ధర ప్రకటించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా జీడిపిక్కల ధర శతశాతం దిగజారడం, పెట్టుబడి వ్యయం పెరగడం వల్ల గిట్టుబాటు కాక రైతుల ఆర్థిక పరిస్థితి క్షీణించి ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరిన్ని ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమై, హత్యా నేరం మూటగట్టుకోవాల్సి వస్తుందన్నారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న జీడి రైతు సైని సింహాచలం చిత్రపటానికి నివాళ్లర్పించారు. సమావేశంలో సాతుపల్లి కాంతారావు, అంబటి రామకృష్ణ, బత్తిని లక్ష్మీనారాయణ, రెయ్య గణపతి, కుత్తుం వినోద్, కుత్తుం ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.










