ప్రజాశక్తి ఎటపాక
గిరిజన సంఘం రంపచోడవరం జిల్లా మహాసభ ఈనెల 28న రంపచోడవరంలో జరుగుతుందని, దీనిని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాక అర్జున్ దొర పిలుపునిచ్చారు. సోమవారం ఎటపాకలోని గిరిజన సంఘం ప్రాంతీయ కార్యాలయంలో సవలం రాము అధ్యక్షతన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అర్జున్ దొర మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన తెగలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. విద్యా వైద్య, మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గిరిజనులకు ఉన్న చట్టాలను, జీవోలను అమలు చేయకుండా, కొత్తగా రాయలసీమ జిల్లాలకు చెందిన బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి చేర్చుతూ 52జీవో జారీ చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ మండల కార్యదర్శి ఇరపా అజరు, నక్కా సూరిబాబు, ముర్రం వెంకటేష్, అపకా సమ్మక్క పాల్గొన్నారు.










