Aug 21,2023 20:43

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న వ్య.కా.స నాయకులు

 కడప అర్బన్‌ : బద్వేలు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, గోపవరం, అట్లూరు, బి.మఠం, మైదుకూరు మండలాలలో ప్రభుత్వ బంజరు భూములు విస్తారంగా ఉన్నాయని అర్హులైన దళితులు, పేదలకు సమగ్ర భూపంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనె 28న బద్వేల్‌ ఎన్జీవోహోమ్‌లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శివకుమార్‌, అన్వేష్‌ తెలిపారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో భూమి కోసం బద్వేల్‌ రెవెన్యూ సదస్సును జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదస్సుకు ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, జిల్లా భూపోరాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ బి.నారాయణ హాజరవుతారని తెలిపారు. జెడ్‌హెచ్‌డిసి కింద ప్రభుత్వం టి.చల్లగిరిగల, మడకవారిపల్లె నంద్యాలంపేట, ముత్తుకూరు రెవెన్యూ గ్రామాలలో దళిత కుటుంబాలకు ప్రభుత్వ భూములు 40 ఏళ్ల కిందట ఇచ్చిందని చెప్పారు. అప్పటినుంచి జిల్లాఎస్సీ కార్పొరేషన్‌ వారికి పన్ను కడుతున్నారే తప్ప వారికి రైతు భరోసా, బ్యాంక్‌లలో పంట రణాలు, నష్టపరిహారం, వడ్డీ మాఫీ తదితర సౌకర్యాలు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. వారందరికీ అసైన్మెంట్‌ కమిటీలో పట్టాలు మంజూరు చేసి ఆన్‌లైన్‌లో పాస్‌ బుక్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గోపవరం మండలం పిపి కుంట పరిధిలో దాదాపు పది గ్రామాలలో సోమశిల ప్రాజెక్టు ముంపు వాసులు ఏళ్ల తరబడి ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వటం లేదని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్డీవోకి దరఖాస్తులు పెట్టి 90 రోజులైనా ఇప్పటికీ ఇంటి స్థలాలు మంజూరు చేయ లేదని తెలిపారు. వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సదస్సుకు బద్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గ్రామీణ పేదలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి. వెంకటేష్‌, ఎస్‌. వీరయ్య, గురువయ్య, జిల్లా కమిటీ సభ్యులు గోవిందు, రాయప్ప పాల్గొన్నారు.