Nov 16,2023 21:06

కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :   వివిధ సామాజిక వర్గాల జనాభాను తెలుసుకొనే లక్ష్యంతో ఈనెల 27 నుంచి జిల్లా వ్యాప్తంగా కులగణన ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా కులగణన సర్వే జరుగుతుందని, దీనికి యంత్రాంగం సిద్దం కావాలని ఆదేశించారు. కుల గణన-2023పై టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, ప్రజల సామాజిక స్థితిగతులను తెలుసుకోవడం కోసం కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను రూపొందించడానికి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఈ సర్వే వివరాలు దోహదపడతాయని పేర్కొన్నారు. బలహీన, వెనుకబడిన వర్గాల వారికి మరింత మేలు జరుగుతుందని చెప్పారు. కులగణన గురించి ముందుగానే వలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించి, అపోహలను తొలగించా లని సూచించారు. సర్వేలో కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలనే నమోదు చేయాలని, వాటికి సంబంధించిన ధ్రువప్రతాలను అడగనవసరం లేదని స్పష్టం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి, ఎవరి కులం వారికే నమోదు చేయాలన్నారు. ఎవరైనా కులం పేరు చెప్పడానికి ఇష్టపడకపోతే, వారిని బలవంతం చేయవద్దని స్పష్టం చేశారు. సేకరించిన సమాచారం ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటుందని, దీనిని ఏ ప్రయివేటు సంస్థకు, వ్యక్తులకు వెళ్లడించడం జరగదని చెప్పారు.
కుల గణనలో భాగంగా నవంబర్‌ 27 నుండి వారం రోజుల పాటు మొబైల్‌ యాప్‌ ద్వారా డోర్‌ టూ డోర్‌ సర్వే నిర్వహిస్తారని కలెక్టర్‌ చెప్పారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖ, ప్లానింగ్‌, సంక్షేమ శాఖల నుండి ఎంపిక చేసిన సూపర్‌వైజర్‌లు ఈ సర్వేను పర్యవేక్షిస్తా రన్నారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి కులగణన చేస్తారని తెలిపారు. ముందుగానే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి కులగణన గురించి వివరించాలని సూచించారు. మండల స్థాయిలో తాహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఇఒపిఆర్‌డిలు, మండల ప్రత్యేకాధికారులు ఈ సర్వేని పర్యవేక్షిస్తారని తెలిపారు. వివరాలను నమోదు చేయడం కోసం ప్రత్యేక యాప్‌ త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. వివిధ కుల సంఘాలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంఘాలను పిలిచి కులగణన గురించి వివరించాలని సూచించారు. ప్రతీ వ్యక్తి వివరాలు నమోదు చేసినప్పుడు వారి ఇకెవైసి తప్పనిసరిగా చేస్తారని. వయసు 8ఏళ్ల లోపు ఉన్న వారికి ఇకెవైసి తప్పనిసరి కాదని తెలిపారు. ప్రతీ కుటుంబానికి సర్వే పూర్తి చేసిన తర్వాత సచివాలయం సిబ్బంది బయోమెట్రిక్‌ వేసి వివరాలను సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెసి మయూర్‌ అశోక్‌, జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌, సిపిఒ పి.బాలాజీ, డిపిఒ నిర్మలాదేవి, ప్రత్యేకాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, తాహశీల్దార్లు పాల్గొన్నారు.