ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనవరి 27న సాయంత్రం ఉక్కునగరం త్రిష్ణా మైదానంలో జరిగే ఉక్కు ప్రజా గర్జనను కుటుంబ సభ్యులతో పాల్గొని విజయవంతం చేయాలని ఉక్కు పర్మినెంట్, కాంట్రాక్టు కార్మిక వర్గానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఉక్కునగరంలోని ఎఐటియుసి కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కో-కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడారు. త్యాగాల పునాదుల మీద ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం అమ్ముతామని ప్రకటించడం దుర్మార్గమన్నారు. ఎన్నో పోరాటాలు, 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన ఉక్కు కర్మాగారాన్ని బడా కార్పొరేట్ శక్తులకు కట్ట బెడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశానికే తలమానికమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరు అన్నారు. ఈ కర్మాగారం వల్ల సుమారు 32 వేల మంది శాశ్వత, ఒప్పంద కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందటంతో పాటు మరో లక్ష మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఉక్కునగరంలో జరిగే ఉక్కు ప్రజా గర్జనకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షస్థాయి నేతలను, రాష్ట్ర, జాతీయ కార్మిక సంఘాల నేతలను ప్రసంగించడానికి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పోరాట కమిటీ నేతలు కెఎస్‌ఎన్.రావు, జె.రామకృష్ణ, ఎ.మసేనరావు, డొక్కా నర్సింగరావు, నీరుకొండ రామచంద్రరావు, కారు రమణ, కొరివి అవతారం, యు.రామస్వామి, వైటి.దాసు, శ్రీనివాసరాజు, జిఆర్‌కె.నాయుడు, విళ్ళా రామ్మోహన్‌కుమార్, కోగంటి లెనిన్‌బాబు, బొడ్డు పైడిరాజు, ఉగ్రం, జి.గణపతిరెడ్డి, దొమ్మేటి అప్పారావు, గాలి నాయుడు, పిట్టా రెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, మంగా వెంకట్రావు, కె.పరంధామయ్య, డివి రమణారెడ్డి, సిహెచ్.సన్యాసిరావు, వి.రామ్‌కుమార్, ఎం.ప్రసాదు, మహాలక్ష్మి నాయుడు, కె.శ్రీనివాస్‌నాయుడు, గుమ్మడి నరేంద్ర, వి.ప్రసాదు, టి.ఈశ్వరరావు, కోరాడ వెంకట్రావు, బంటు రాము, ఇందల శివ, బికె నాయక్ తదితరులు పాల్గొన్నారు.










