
ప్రజాశక్తి - గుంటూరు : నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు కోరారు. ఈ మేరకు బ్రాడీపే టలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహి ంచిన ప్రజాసంఘాల కార్యకర్తల సమావేశానికి యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ అధ్యక్షత వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేట 2/7లోని జాషువా విజ్ఞాన కేంద్రంలో జయంతి సభ ఉంటుందని, జాషువా సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ అభ్యుదయ రచ యిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి ప్రదానం చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 'జాషువా సాహిత్యం-సామాజిక న్యాయం' అంశంపై ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, అభ్యుదయ కవి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. జిల్లాలోని కవులు, రచయితలు, సాహితీ ప్రియులు, ప్రముఖులు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాశం రామారావు మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతులకు వ్యతిరేకంగా జాషువా తన సాహిత్యాన్ని అందించా రన్నారు. కుల, మత, ప్రాంతీయ తత్వాలకు, మహిళలపై అత్యాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జాషువా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందన్నారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు వై.నేతాజి, కె.నళినీకాంత్, ఎన్.భావన్నారాయణ, వివికె సురేష్, ఆదిలక్ష్మీ, సమీర్, వెంకట్రావు, ఎం.ఎ.చిస్టీ, షకీల, సాంబశివరావు, బి.లక్ష్మణరావు, అక్బర్ పాల్గొన్నారు.