Sep 19,2023 23:46

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న కెఎస్‌ లక్ష్మణరావు, పాశం రామారావు తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు : నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి సభను 27న సాయంత్రం 4 గంటలకు గుంటూరు 2/7 బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మీటింగ్‌ హాల్‌లో నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు కరపత్రాన్ని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరే గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అందచేస్తున్న కవితా పురస్కారాన్ని 2023 సంవత్సరానికిగాను ప్రముఖ అభ్యుదయ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. సభలో మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌, అభ్యుదయ రచయితల సంఘం అఖిలభారత అధ్యక్షులు పెనుకొండ లక్ష్మీనారాయణ, సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యాజీ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. నాటి సామాజిక వ్యవస్థలో ఉన్న రుగ్మతలకు వ్యతిరేకంగా ప్రజలను గుర్రం జాషువా సాహిత్యం చైతన్యం చేసిందని, నేటి సామాజిక పరిస్థితుల్లో జాషువా సాహిత్యానికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. జాషువా సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ ట్రస్టీ పాశం రామారావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా కుల వివక్ష, అంటరానితనం, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. కుల, మత, ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టబడ్డాయన్నారు. వీటికి వ్యతిరేకంగా జాషువా తన కళాన్ని ఝుళిపించారని, మూఢ నమ్మకాలపై జాషువా సాహిత్యం యుద్ధం ప్రకటించిందని అన్నారు. ఈ సాహిత్యాన్ని ప్రజలందరికీ చేర్చాలన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఇ.అప్పారావు, బి.శ్రీనివాసరావు, ఎంఎ.చిస్టీ, ఎం.కిరణ్‌ పాల్గొన్నారు.