Nov 20,2022 22:08

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
             ఈ నెల 27న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ మహాసభ నిర్వహించనున్నట్లు ఎపి జెఎసి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఛైర్మన్‌ కె.రమేష్‌కుమార్‌ తెలిపారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్‌ కార్యా లయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 12 వేల పైచిలుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులంతా ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ చేరుకొని అక్కడి నుండి భారీ ర్యాలీగా తుమ్మలపల్లి కళ క్షేత్రం వరకూ చేరుకుంటామని తెలిపారు. ఈ సభకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిధులుగా వస్తారన్నారు. సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని కోరారు. అనంతరం సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగుల డివిజన్‌, మండల కమిటీలను నియమించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్సేన్‌, శివశంకర్‌, ఏలూరు జిల్లా అధ్యక్షులు కమల్‌, కార్యదర్శి సాయినాధ్‌, రాష్ట్ర మహిళా విభాగ నాయకురాలు జ్యోతి పాల్గొన్నారు.