Oct 13,2022 23:40

అభివాదం చేస్తున్న బిసి సంఘం నాయకులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : బిసిలను సంఘటితపరచి, సమస్యల పరిష్కారానికి ఈ నెల 27న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బిసిల ఆత్మగౌరవసభను నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పితాని ప్రసాద్‌ తెలిపారు. గురువారం విజెఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిసిల సంక్షేమానికి, రాజకీయ అభ్యున్నతికి మొదటి ప్రాధాన్యతను కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో 11 మంది బిసిలకు స్థానం కల్పించాలని చెప్పారు. బిసిల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యునిగా పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మూడు రాజధానులకు జాతీయ బిసి సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఉత్తరాంధ్ర బిసి సంఘం కన్వీనర్‌ సనపల లక్ష్మి నరసింహం మాట్లాడుతూ, బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బాగా వెనుకబడిన బిసి కులాలకు రూ.పది లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, బిసి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, వసతిగృహాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలని మహాసభలో తీర్మానాలు చేస్తున్నట్లు తెలియజేశారు. బిసిల రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించకపోతే పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేసిన 45 అంశాలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా బిసి సంఘం అధ్యక్షులు దవళ రమేష్‌ కుమార్‌, బిసి సంఘ నాయకులు శివకుమార్‌, వెంకటేశ్వరరావు, యశ్వంత్‌ తదితరులు మాట్లాడారు.