Nov 16,2023 21:37

మండలాధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం :  జిల్లాలో కులగణన ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. కులగణన ప్రక్రియపై గురువారం స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా, మండల అధికారులతో వర్చువల్‌ గానూ, కుల సంఘాలతో ప్రత్యక్షంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కులగణన వల్ల సంక్షేమ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయవచ్చని తెలిపారు. కుల గణనలో సేకరించాల్సిన వివరాలపై ప్రభుత్వం ప్రశ్నావళి రూపొందించిందని పేర్కొన్నారు. సచివాలయం యూనిట్‌గా సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల సహకారంతో కుటుంబాల నుంచి వ్యక్తిగత సమాచారం, సామాజిక హౌదాకు సంబంధించిన సమాచారం సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తెలియజేయవచ్చని అన్నారు. ప్రజలు తెలిపిన సమాచారానికి సంబంధించి ధ్రువీకరణ అవసరం లేదని తెలిపారు. ప్రజల నుండి సేకరించిన సమాచారం గోప్యంగా జరుగుతుందని, సమాచారం ప్రభుత్వం వద్ద పూర్తి రక్షణలో ఉంటుందని స్పష్టం చేశారు. కుల గణన సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాల తొలిగింపు ఉండదని స్పష్టం చేశారు. అలాగే కుల గణనకు కులధ్రువీకరణ పత్రాలు జారీకి కూడా సంబంధం లేదన్నారు.
20 నుంచి కుల గణనపై అవగాహన
కుల గణనపై ఈనెల 20 నుండి 25 వరకు ఇంటింటికీ వాలంటీర్లు వెళ్లి అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. కులగణన వల్ల సంక్షేమ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలుకు అవకాశం ఏర్పడుతుందనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 8ఏళ్లలోపు గల పిల్లలకు ఇకెవైసి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆధార్‌ ఆధారిత అధీకృత ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఉంటే వారు వచ్చేలా చూడాలని సంఘం నాయకులను కోరారు.
మూడు స్థాయిలో ఇకెవైసి చేయాలి
కులగణన ఈనెల 27 నుంచి ప్రారంభమై వారం రోజుల్లో పూర్త వుతుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి కె.రామచంద్ర రావు అన్నారు. కుల గణన ఆన్‌ లైన్‌ విధానంలో మాత్రమే జరుగుతుందని చెప్పారు. సచివాలయం యూనిట్‌గా జరుగుతుందని, సచివాలయం పరిధిలో సచివాలయం సహాయకులు, వాలంటీరు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తారని తెలిపారు. ఇందుకు ఆన్‌లైన్‌ యాప్‌లో ప్రభుత్వం వద్ద ఉన్న సంబంధిత కుటుంబాల వివరాలు ముందస్తుగానే కొంత మేర పొందుపర్చనున్నట్టు తెలిపారు. ఈ వివరాలతో పాటు మరి కొన్ని వివరాలు సేకరిస్తామన్నారు. ఒక కుటుంబంలో వ్యక్తులంతా మరణించినా చుట్టు పక్కల వారి నుండి వివరాలు సేకరించి ఇకెవైసి చేయాలని సూచించారు. ఆన్‌ లైన్‌ యాప్‌ లో సిఎఫ్‌ఎంఎస్‌ విధానంలో లాగిన్‌ కావాలని, ఏ ఫోన్‌లో లాగిన్‌ అయితే అదే ఫోన్‌ కుల గణన పూర్తి అయ్యే వరకు వినియోగించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్‌డిఒలు కె.హేమలత, ఎం.లావణ్య, డిపిఒ బలివాడ సత్యనారాయణ, సిపిఒ పి.వీర్రాజు, గిరిజన, సాంఘిక, బిసి సంక్షేమశాఖల డిడిలు కె.శ్రీనివాసరావు, ఎం.డి.గయాజుద్దీన్‌, ఎస్‌.కృష్ణ, దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ రంగుముద్రి రమాదేవి, తూర్పుకాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మజ్జి నాగమణి, తెలుకల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకట రమణ, కళింగ వైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ లాడి మెహర్‌ ప్రసాద్‌, షెడ్యూల్‌ కులాల ప్రతినిధులు సవరపు రామారావు, డి.శాంతిరాజ్‌, షెడ్యూల్‌ తెగల ప్రతినిధులు ఎ.చంద్ర శేఖర్‌, రోబ్బ లోవరాజు తదితరులు పాల్గొన్నారు.