
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని తరగతులకు చెందిన కులాల వారి సంఖ్యను లెక్కించేందుకు ఈనెల 27 నుంచి గణనను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కుల గణన కోసం ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌ను వెల్లడించారు. కుల గణన తర్వాత ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించవచ్చని తెలిపారు. కుల గణనలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. సచివాలయం పరిధిలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా వారి వివరాలను సేకరిస్తారని తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయా సచివాలయ పరిధిలో 10 శాతం ఇళ్లల్లో రీ వెరిఫికేషన్ చేసి గణన వివరాలను సరిపోల్చి చూస్తామని తెలిపారు. ఎన్యుమరేటర్లకు గ్రామ, మండల, డివిజనల్, జిల్లాస్థాయి శిక్షణను ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కుల గణనకు సచివాలయ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపారు. ఒకే విడతలో కుల గణను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్వే సమయంలో ఎక్కడైనా మిగిలిపోయిన ఇళ్లు ఉంటే డిసెంబరు పదో తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. సర్వే సమయంలో ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అడగరాదని స్పష్టం చేశారు. వ్యక్తి పేరు, వయసు, లింగం, భూమి (వ్యవసాయ, వ్యవసాయేతర), ఇంట్లోని పశువులు, వృత్తి, అన్నిరకాలుగా వచ్చే ఆదాయం, కులం, ఉప కులం, మతం, విద్యార్హత, నివాసం ఉండే ఇళ్లు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, గ్యాస్ ఉందా? లేదా? అనే వివరాలు మాత్రమే సేకరించాలని తెలిపారు. దీనిపై ఈనెల 17న జిల్లాస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.